ఈశావాస్య ఉపనిషత్తు - 3

ఎనిమిదవ శ్లోకం:
. పర్యాగాచ్చుక్ర మకాయవ్రణమస్నావిరగ్‌ం శుద్ధమపాపవిద్ధం
కవిర్మనీషీ పరిభూః స్వయం భూ ర్యాథాతథ్యతోర్థాన్ వ్వదధాచ్చాశ్వతీభ్యః సమాభ్యః
అర్థం:
అతడు(అంటే ఆత్మానుభూతి పొందినవాడు) అన్నిటి అంతరార్థాన్నీ గ్రహిస్తాడు.మనసును వశం చేసుకొన్నవాడు.మొత్తం జ్ఞానాన్నీ తనలో ఉంచుకొన్నవాడు.ఎవరికీ చెందనివాడు.అన్నివేళలా అన్ని వస్తువుల నిజమైన నైజాన్ని తెలుసుకొన్నవాడు.ఉజ్వలమైన శరీరం లేని,కండలు లేని,పాపం లేని పరిపూర్ణమైన,స్వచ్చమైన దేవుడిని అతడు చేరుకొంటాడు.

వివరణ:
ఈ శ్లోకంలో ఆత్మానుభూతి పొందిన వాడి అనుభవం చెప్పబడింది.
సాధారణ మానవులమైన మనం ఏదైనా వస్తువును చూడడం తో ఆగిపోతాం. కాని అతడు ఒక వస్తువును చూడడమే కాకుండా దానికి సంబంధించిన మొత్తం జ్ఞానాన్ని తెలుసుకోగలడు.
అతడు మాత్రమే నిజమైన మనీషి. మనీషి అంటే మనసును వశం చేసుకొన్నవాడు అని అర్థం. మనసు చెప్పినట్లు అతడు ఆడడు,అతడు చెప్పినట్లు అతని మనసు ఆడుతుంది.
మనం ఎంత నేర్చుకొన్నా ఇంకా నేర్చుకోవాలనే కోరికతో తృప్తిలేకుండా ఉంటాము. కాని ఆత్మానుభూతి పొందినవాడికి తెలుసుకోవలసింది ఏమీ లేకపోవడం వలన అతడు నిత్యతృప్తుడై ఉంటాడు. అందుకే ఏది తెలుసుకొంటే ఇక తెలుసుకోవలసింది ఏమీ ఉండదో అదే ఆత్మ అని "కేనోపనిషత్తు" లో కూడా చెప్పబడింది.
ఎవరికీ చెందనివాడంటే అతడు కేవలం ఆత్మ లేక భగవంతుడిపైనే ఆధారపడిఉంటాడు కాబట్టి మిగతా జీవరాసులపై కాదు.
అతడు వస్తువుల నిజమైన తత్వాన్ని తెలుసుకొన్నవాడు కాబట్టి దేనికీ లొంగనివాడు.
భగవంతుడు నిరాకారుడు కాబట్టి కేవలం అనుభూతి ద్వారా మాత్రమే అతనిని తెలుసుకోగలం కాబట్టి అతడు కండలు లేనివాడని,శరీరం లేనివాడని చెప్పబడింది.
పాపంలేకపోవడం, తేజోమయం, స్వచ్చమైనది అనే గుణాలు భగవంతుడి గుణాలుగా చెప్పబడినవి.

తొమ్మిదవ శ్లోకం:
.అంధం తమః ప్రవిశన్తి యేవిద్యాముపాసతే
తతో భూయ ఇవ తే తమో య ఉ విద్యాయాగ్ంరతాః
అర్థం:
ఎవరు కర్మల(పనుల)లో పాల్గొంటారో వారు చిమ్మచీకటిలోనూ, అలాగే జ్ఞానాన్ని అవలంబిస్తారో వారు అంతకన్నా కారుచీకటిలో మునిగిపోతారు.

వివరణ:
ఈ శ్లోకం చాలా విశేషార్థం కలిగిఉంది. ఒక లక్ష్యం అంటూ లేకుండా ఎవరైతే ఊరికే పనులు చేసుకుంటూ ఉంటారో వారు బాధలకు గురి అవుతారు.
అలాగే అర్హత లేకుండా డాంబికం కోసం అంటే లోకం దృష్టిలో పడడం కోసం,లోకం తనను పొగడడం కోసం ఎవరైతే ధ్యానము, భక్తి మొదలగు వాటి కోసం ప్రయత్నిస్తారో(అంటే మనస్పూర్థిగా కాకుండా) వారు ఇంకా ఎక్కువ బాధలు పడతారు అని అర్థం.
దీని గురించి అందరికీ తెలుసు, ఎక్కువ వివరణ అవసరం లేదని భావిస్తున్నాను.

పదవ శ్లోకం:
౧౦.అన్యదేవాహు ర్విద్యయా అన్యదాహురవిద్యయా
ఇతి శుశ్రుమ ధీరాణాం యేన స్తద్విచచక్షిరే
అర్థం:
ఆత్మ విద్య ద్వారా ఒక ఫలితం, కర్మల(పనుల) ద్వారా మరొకరకమైన ఫలితం లభిస్తాయి. మాకు దానిని వివరించిన మహాత్ములు ఇలా చెప్పారు.

పదకొండవ శ్లోకం:
౧౧.విద్యాం చావిద్యాం చ య స్తద్వేదో భయగ్‌ం సహ
అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయామృతశ్నుతే

అర్థం:
జ్ఞానం(అంటే భగవంతుని తెల్సుకొనే విద్య), కర్మలు(పనులు) రెండింటినీ కలిపి తెలుసుకొన్నవాడు కర్మల ద్వారా మరణాన్ని దాటి, జ్ఞానం ద్వారా అమర్త్వాన్ని పొందుతాడు.

వివరణ: ఈ శ్లోకంలో తము తెలుసుకొన్నామని చెప్పుకోకుండా తమ గురువుల ద్వారా తెలుసుకొన్నామని చెప్పుకుంటున్నారు. మనం బ్రతకాలంటే పనులు చేయక తప్పదు. కాని ఆ పనులు మాత్రమే చేసుకుంటూ కూర్చుంటే భగవంతుని గురించి తెలుసుకోలేము. కాబట్టి పనులు భగవదర్పితం అయ్యుండాలి(ఉపనిషత్తు యొక్క మొదటి శ్లోకం చూడండి). ధ్యానం మనస్పూర్థిగా ఉండాలి. జ్ఞానం,పని రెండింటినీ సమన్వయంతో సాధించినవాడికే ఆత్మానుభూతి అని చెప్పబడింది.

పన్నెండవ శ్లోకం:
౧౨.అంధం తమః ప్రవిశన్తి యే సంభూతిముపాసతే
తతో భూయ ఇవ తే తమో య ఉ సంభూత్యాగ్‌ం రతాః
అర్థం:
దేవుడిని నిరాకారము గా పూజించేవారు కటిక చీకటిలోనూ, ఆకారం ఉన్నవాడిగా పూజించేవాడు ఇంకా ఘోరచీకటిలోనూ మునిగిపోతారు.

పదమూడవ శ్లోకం:
౧౩.అన్యదేవాహుః సంభవాదన్యదాహురసమ్భవాత్
ఇతి శుశ్రుమ ధీరాణాం యే నస్తద్విచచక్షిరే
అర్థం:
మాకు దానిని వివరించిన మహాత్ములు విన్నది ఏమంటే " సాకార ఉపాసన వలన ఒక ఫలితం,నిరాకార ఉపాసన వలన మరోరకమైన ఫలితం లభిస్తాయి" అని.

పదునాల్గవ శ్లోకం:
౧౪.సంభూతిం చ వినాశం చ యస్తద్వేదోభయగ్‌ం సహ
వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యామృతమశ్నుతే
అర్థం:
సాకార ఉపాసన, నిరాకార ఉపాసన రెంటినీ కలిపి గ్రహించినవాడు సాకారోపాసన వలన మరణాన్ని దాటి, నిరాకారోపాసన వలన అమరత్వం పొందుతాడు.

వివరణ:
మనకు రూపం, గుణాలు ఉన్నాయి కాబట్టి మన జ్ఞానం రూపాన్ని,గుణాలను దాటిపోవాలంటే కష్టం. దేవుడిని నిరాకారముగా పూజించడములో కలిగే కష్టం ఇది. దానివలన మనకు ఏదీ సరిగా అర్థం కాదు. ఆధ్యాత్మికముగా ఉన్నతస్థితిలో ఉన్నవారికి మాత్రమే ఇది సాధ్యము. అందువలన మనలాంటి సాధారణజీవులకు ఇది చీకటిలో ఉన్నట్లే లెక్క.
అలాగే సాకారఉపాసన అంటే రాముడిగానో,శివుడిగానో పూజించడం. ఇలా పూజించాలంటే అన్ని దేవుళ్ళరూపాలు ఒకే పరమాత్మ అని గ్రహించి ఉండాలి. లేకుంటే "దశావతారం" చిత్రంలో రాజుల కాలం నాటి పరిస్థితి ఎదురవుతుంది. అంటే నీ దేవుడి కంటే నా దేవుడే గొప్ప అనే దురభిమానం,మూఢభక్తి లాంటి ప్రమాదాలు ఎదురవుతాయి. అందుకని ఇది ఇంకా చీకటిలో ఉండడం అన్నమాట.
కాబట్టి రెండింటినీ కలిపి మనం ఆత్మానుభూతి పొందాలనేది ఈ శ్లోకాల అర్థం. అది ఎలా అనేది తర్వాతి శ్లోకాలలో చూస్తాము.

ముందుభాగం తర్వాతిభాగం

One response to “ఈశావాస్య ఉపనిషత్తు - 3”

సాకార ఉపాసన అంటే దేవతా విగ్రహాలను పూజించటం కాదనుకుంటా దైవ ప్రతినిధులుగా తమను తాము సృస్టించుకొని పూజలందుకొనే మానవులనుద్దేసించి చెప్పబడి ఉండవచ్చు ఒక్కసారి ఆలోచించండి