ఈశావాస్య ఉపనిషత్తు - 4

పదహైదవ శ్లోకం:
౧౫. హిరణ్మయేన పాత్రేణసత్యస్యాపిహితం ముఖం
తత్ త్వం పూషన్నపావృణు సత్యధర్మాయ దృష్టయే

అర్థం: సత్యం యొక్క ముఖం బంగారు తెరతో కప్పబడి ఉంది. ఓ సూర్యదేవా! సత్యనిష్ఠుడనైన నేను ఆ సత్యాన్ని దర్శించడానికి తెరను తొలగించు.

వివరణ:ఈ శ్లోకం మన ఊహకు కూడా అందని దాన్ని గురించి తెలుపుతోంది. అజ్ఞానం అనే చీకటి నుండి జ్ఞానం అనే వెలుగులోనికి తోడ్కొని వెళ్ళమని ప్రార్థన మనకు తెలుసు. ధ్యానం,భక్తి మొదలగు వాటివలన భగవత్‌దర్శనం కలుగుతుంది. అంటే వెలుగులోనికి మనం ప్రయాణించగలం. కాని సత్యం అనేది వెలుగుచీకట్లకు,జ్ఞానాజ్ఞానాలకు అతీతమైనది. అంటే ఆ తేజస్సును అంటే వెలుగును కూడా దాటిపోవాలి అనే విషయం ఈ శ్లోకం లో తెలుస్తోంది. ఆ తేజస్సునే ఇందులో సత్యం యొక్క ముఖం బంగారు తెరతో కప్పబడి ఉన్నదని చెప్పబడింది."సత్యనిష్ఠుడనైన నేను" అని ఎందుకు అంటున్నారంటే తన అర్హతను తెలిజేయడం జరుగుతోంది.నిరాకార,నిర్గుణమైన సత్యం ను అనుభూతి పొందడానికి ప్రార్థించడం ఇక్కడ జరుగుతోంది.

పదహారవ శ్లోకం:
౧౬. పూషన్నేకర్షే యమ సూర్య ప్రాజాపత్య వ్యూహ రశ్మీన్ సమూహ
తేజో యత్ తే రూపం కళ్యాణతమం తత్ తే పశ్యామి
యో సావసౌ పురుషః సోహమస్మి

అర్థం:సకల జీవరాసులను పోషించి కాపాడేవాడవు, ఒంటరిగా పయనించేవాడవు. అన్నిటినీ పాలించే ఓ సూర్యదేవా! ప్రజాపతి కుమారుడా! నీ కిరణాలను ఉపసంహరించుకో. నీ తేజస్సును కుదించుకో. కళ్యాణకరమైన నీ స్వరూపాన్ని నీ అనుగ్రహం తో నేను చూస్తున్నాను. ఆ సూర్యునిలో ఉన్నది "నేనే".

వివరణ:ఈ శ్లోకం లో ఋషి తను దర్శించినది చెప్పినాడు. భగవత్కృపతో దర్శిచి ఆ సత్యమైన పదార్థం "నేను" అని కనుగొన్నాడు. ఇక్కడ "నేను" అని సూచించబడ్డది మనం మామూలు అర్థంలో తీసుకోకూడదు.
ఈ "నేను" అన్నది ఏంటో నాకు( బ్లాగు రచయిత) చెప్పడానికి అర్హత కానీ, అనుభవపూర్వక జ్ఞానం కానీ లేవు. కానీ ఉపనిషత్తు ప్రకారం ఈ "నేను" అనేది ముందటి శ్లోకాలలో చెప్పబడిన "ఒకే వస్తువు". ఇంతకు మించి ఈ బ్లాగు రచయిత ఏమీ చెప్పలేడు. ఈ స్థితి అత్యున్నత స్థితి, భగవంతుడి స్థితి అని మాత్రం చెప్పగలను.

పదిహేడవ శ్లోకం:
౧౭. వాయురనిలమమృతమథేదం భస్మాన్తగ్‌ం శరీరం
ఓం(3) క్రతో స్మర కృతగ్‌ం స్మర క్రతో స్మర కృతగ్‌ం స్మర

అర్థం:ఈ శరీరం కాలి బూడిద అయిపోతుంది.ఈ శరీరప్రాణం మరణంలేని ప్రాణంతో కలిసిపోతుంది. ఓ మనసా! చేసినవాటిని విచారణ చేయి,విచారణ చేయి.

వివరణ: ఈ శ్లోకం ఒక "స్వయం సూచన" (Self suggestion) లేక "స్వయం ప్రేరణ"(Self Motivation) మంత్రం లాంటిది.నిత్యజీవితములోనైనా సరే, ఆధ్యాత్మిక జీవితములోనైనా సరే ఒక లక్ష్యము ఎంచుకొన్నప్పుడు ఆ లక్ష్యము నుండి జారకుండా ఉండడానికి మన మనసుకు మనమే గుర్తుచేసుకోవడం ఇది.మహారాజైనా, బిక్షగాడైనా ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే, అతడి ప్రాణాలు గాలిలో కలిసిపోవాల్సిందే. దీనిని గుర్తుచేస్తూ ఒక సాధకునికి చెప్తున్న మంత్రం ఇది.

పద్దెనిమిదవ శ్లోకం:
౧౮. అగ్నే నయ సుపథా రాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్
యుయోధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్ఠాం తే నమ ఉక్తిం విధేమ

అర్థం:ఓ అగ్నిదేవా! మేము చేసిన అన్ని పనులూ నీకు తెలుసు. ప్రారబ్ధకర్మలను అనుభవించడానికి మమ్మల్ని అనుభవమార్గంలో తీసుకెళ్ళు. మా ఘోరమైన తప్పుల నుండి మమ్మల్ని విముక్తున్ని చేయి. నీకు అనేక నమస్కారాలు చేస్తున్నాం.

వివరణ: అనుభవమార్గం అంటే "ఇంతవరకు చేసిన పనుల ఫలితాలను మాత్రం అనుభవించేటట్లు చేసి, క్రొత్తపనులతో అంటే చేయబోయేపనుల ఫలితం మాకు అంటకుండా చేయి" అని అర్థం. అంటే చేయబోయే పనులు నిష్కామంగా చేసేట్టు చేయి అని అర్థం.

ఈ శ్లోకం తో "ఈశావాస్య ఉపనిషత్తు" సంపూర్ణమౌతుంది.

శాంతి మంత్రం:

"ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్యతే

ఓం శాంతిః శాంతిః శాంతిఃదేవుడు పరిపూర్ణుడు. ఇది(ఈ ప్రపంచం) పరిపూర్ణమైనది. పరిపూర్ణమైన భగవంతుడి నుండే పరిపూర్ణమైన ప్రపంచం పుట్టింది. పరిపూర్ణం నుండి పరిపూర్ణాన్ని తీసివేసిన తర్వాత కూడా పరిపూర్ణతే మిగిలి ఉంది.

ముందుభాగం

2 Responses to “ఈశావాస్య ఉపనిషత్తు - 4”

సతతము సద్గుణావహము సభ్యత సంస్కృతి కాలవాలమై
యతులితమైవెలుంగు మన యద్భుత వేదవిశిష్ట భాగముల్
క్రతువుగ చేయుచున్న యటు గౌరవ పూజ్య విశిష్ఠతేజ!సం
తతములిఖించుచుంటివి సుధాంబుధిగా కనుగొంటి నిచ్చటన్.

చాలా బాగు౦ది

http://bhamidipatibalatripurasundari.blogspot.in/