ఈశావాస్య ఉపనిషత్తు-2

మూడవ శ్లోకం:
౩.అసుర్యా నామతే లోకా అంధేన తమసావృతాః
తాగ్ంస్తే ప్రేత్యాభిగచ్చన్తియేకే చాత్మహనో జనాః

అర్థం: రాక్షసుల యొక్క లోకాలు గాఢమైన అంధకారముతో అంటే చీకటితో ఉంటాయి. ఆత్మహంతకులు మరణానంతరం ఆ లోకాలను పొందుతారు.

వివరణ:
మనకు తెలుసు రాక్షసులు అంటే ఇతరులను పీడించే స్వభావం లేక గుణాలు కలిగినవారని. అంటే తమ ఆనందం కోసం ఇతరులను చంపడానికైనా తయారుగాఉండేవారు. దీని ప్రకారం మన సమాజంలోనే మనం ఎంతోమంది రాక్షసుల మధ్య ఉన్నామని మనకు తెలుసు.
ఇక ఈ శ్లోకం విషయానికి వస్తే ఆత్మహంతకులు అనగా ఎప్పుడూ శరీరసుఖాలే జీవితలక్ష్యాలుగా చేసుకొని దేవుడి గురించి లేక పరమాత్మను గురించి ఆలోచన చేయనివారు. వీరు రాక్షసులతో సమానం. వీరు చనిపోయినతర్వాత రాక్షసుల లోకాలు పొందుతారు అంటే తమ స్వభావం ప్రకారమే మళ్ళీ
జన్మిస్తారు. అంటే మళ్ళీమళ్ళీ పుడుతూ,చస్తూ బాధలకు గురి అవుతుంటారు. గాఢమైన చీకటి అని ఎందుకన్నారంటే వీరు కన్నూమిన్నూ కానకుండా సంచరిస్తారు. చీకటిలోనే కదా మనం కూడా అలా కదిలేది.

నాల్గవ శ్లోకం:
౪.అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షత్
తద్ధావతో న్యానత్యేతి తిష్ఠత్ తస్మిన్నపో మాతరిశ్వా దధాతి

అర్థం: ఆత్మ కదలలేనిది,ఒక్కటే అయినది. మనస్సు కంటే వేగవంతమైనది. ఇంద్రియాలు దాన్ని పొందలేవు. అన్నిటికన్నా ముందు వెళ్తూనే అది స్థిరముగా ఉంటుంది. కదిలే వస్తువులు అన్నిటికన్నా ఆత్మ వేగవంతమైనది. ఆత్మ స్థిరముగా ఉండటం వలన ప్రాణం అన్నిటితో పనిచేయిస్తుంది.

వివరణ: ఈ శ్లోకం లో ఎన్నో పరస్పర వ్యతిరేక అంశాలు ఉన్నాయి. చలిస్తుంది అనీ చలనం లేనిదనీ, స్థిరము అనీ అన్నిటికన్నా వేగవంతం అనీ వ్యతిరేకాలు ఉన్నాయి. ఏదైనా ఒక వస్తువు కదలాలన్నా, పనిచేయాలన్నా ఒక స్థలం ఉండాలి. విశ్వమంతా ఆత్మ ఒకటే ఉన్నప్పుడు రెండవది లేనప్పుడు ఆత్మ ఎక్కడకు కదలగలదు? అందుకే ఆత్మ చలనం లేనిది అన్నారు.

మనం ఒక వస్తువును అనుకొన్నప్పుడు మన మనసు ఆ వస్తువు రూపాన్ని ఊహించుకొంటుంది లేక ఆ వస్తువు రూపాన్ని గ్రహిస్తుంది. మన శరీరం ఆ వస్తువు వద్దకు వెళ్ళక ముందే మనసు ఆ వస్తువు వద్దకు వెళ్ళిపోతుంది. కాని ఆత్మ ఒక్కటే ఈ విశ్వమంతా వ్యాపించి ఉండడం వలన మనసు,శరీరం అన్నీ అందులోనివే కావడం వలన మనసు ఆ వస్తువు వద్దకు వెళ్ళక ముందే అక్కడ ఆత్మ ఉంటుంది. అంటే ఆత్మ స్థిరముగా ఉంటూనే మనసు కన్నా కూడా వేగవంతం అని చెప్పబడింది.

ఇంద్రియాలు ఆత్మను గ్రహించలేవు. ఎందుకంటే ఇంద్రియాలు ( కన్ను,ముక్కు,చెవి,కాళ్ళు,చేతులు, చర్మము, నాలుక మొదలగునవి) బయటి ప్రపంచాన్ని తెలుసుకోవడానికే సృష్టింపబడ్డాయి.
ఏ వస్తువు కదలాలన్నా, కదలని వస్తువు ఒకటి ఆధారముగా ఉండాలి. బస్సు కదలాలంటే కదలని రోడ్డు, చలనచిత్రం చూడాలంటే కదలని తెర ఉండాలి. ప్రాణం అనేది ఆత్మను ఆధారముగా చేసుకొని ఇంద్రియాలను లేక ప్రపంచముతో పని చేయిస్తుంది.
ఈ శ్లోకం యొక్క వివరణ ఇది.

ఐదవ శ్లోకం:
౫.తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే
తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః

అర్థం: అది చలిస్తుంది మరియు చలించదు. దూరంగా ఉంటుంది మరియు చాలా దగ్గరగా ఉంటుంది. అది అన్నిటి లోపలా మరియు బయట కూడా ఉంటుంది.

వివరణ: ఈ శ్లోకం లో కూడా ముందటి శ్లోకంలో లాగా వ్యతిరేకాలే కనిపిస్తున్నాయి. ముందు శ్లోకంలో చెప్పుకున్నట్లుగా ఆత్మ ఇంద్రియాలకు అందదు.
చలిస్తుంది,చలించదు అనే వాటికి ముందు శ్లోకములో అర్థం చెప్పుకున్నాము.
ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉంది కాబట్టి అందరికీ అది చాలా దగ్గరగా ఉంది. కాని మనం ఆ విషయం అనుభవపూర్వకముగా తెలుసుకోనప్పుడు అది మనకు దూరంగా ఉందనే కదా అర్థం.
ఆత్మ రూపములో అది మనలోనే ఉంది, అలాగే పరమాత్మ రూపంలో మన బయట కూడా ఉంది అన్న విషయం మనకు తెలుసు కదా.

ఆరవ శ్లోకం:
౬.యస్తు సర్వాణి భూతాన్యాత్మ న్యేవాను పశ్యతి
సర్వభూతేషు చాత్మానం తతోన విజుగుప్సతే
అర్థం: ఎవరైతే ఆని జీవులను ఆత్మలోనూ, ఆత్మను అన్ని జీవులలోనూ చూస్తాడో అతడు ఎవరినీ ద్వేషించడు.

ఏడవ శ్లోకం:
౭.యస్మిన్ సర్వాణి భూతాన్యాత్మైవాభూద్విజానతః
తత్రకో మోహః కః శోక ఏకత్వమనుపశ్యతః
అర్థం: ఆత్మే అన్ని జీవరాసులుగా ఉన్నదని గ్రహించిన వ్యక్తికి మోహం, శోకం ఎలా ఉంటాయి?

వివరణ: పై 6,7 శ్లోకాలు ఆత్మను సాక్షాత్కరించుకొన్నవాడి లేక ఆత్మానుభూతి పొందిన వాడి గురించి చెబుతున్నాయి.
మనకు ఇష్టం లేనిదాన్ని మనం ద్వేషిస్తాం. విపరీత ఆకర్షణ వలన మనకు ఒక వస్తువుపై మోహం కలుగుతుంది. మనకు ఇష్టం లేనిది జరిగినప్పుడు మనకు బాధ కలుగుతుంది.
కాని ఆత్మానుభూతి పొందిన వ్యక్తి విశ్వాన్ని అంతటినీ ఆత్మస్వరూపంగా లేక భగవంతుడిగా చూస్తాడు. అలాంటప్పుడు అతనికి ఆత్మ తప్ప ప్రపంచములో వేరేది కనిపించదు. ఏదైనా రెండవ వస్తువు ఉన్నప్పుడు మాత్రమే కదా మనకు దానిపైన మనసు పోయేది. అంతా ఒకటే అయినప్పుడు మనసు ఎక్కడకు పోగలదు. ఒక్కచోటే ఉంటుంది. అందువలన బాధ గాని, ఆకర్షణ లేక మోహం కాని, ద్వేషం కాని ఎలా ఉంటాయి. ఇవన్నీ ఆత్మానుభూతి పొందిన వాడి లక్షణాలు.

ఆత్మానుభూతి, ఆత్మసాక్షాత్కారం మొదలగునవి ఆంతరంగిక అనుభవాలు. బయటి ప్రపంచం ముందులానే ఉంటుంది. కాని చూసేవాడి మనసును బట్టి వ్యక్తివ్యక్తికీ ప్రపంచస్వభావం వేరేలా ఉంటుంది. ఒక యువకుడికి ఏదైనా సాధించగలననే విశ్వాసం ఉంటుంది. అదే ఒక ముసలివ్యక్తికి అంతా అయిపోయిందనే భావన ఉంటుంది. ప్రపంచం ఏమీ మారలేదు. మార్పు అంతా చూసేవాడిని బట్టే. అలానే ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తికి రెండు కొమ్ములు ఏమీ రావు. అతని మనసు విశాలమై విశ్వమంతటితోనూ ఏకం అవుతుంది.

ముందుభాగం తర్వాతిభాగం

One response to “ఈశావాస్య ఉపనిషత్తు-2”

మీరుచేసే పని నాలాంటి చాలామందికి (ఉపనిషత్తుల గురించి,వేద వాఙ్మయం గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళం), పనికొస్తుంది....

నాకు ఉపనిషత్తులతో అంతగా పరిచయం లేదు, కానీ తెలుసుకోవాలని కోరిక మాత్రం ఉంది.అదీ కాక వాల్మీకి తన రామాయణంలో ఉపనిషత్ సూత్రాలను పొందుపరచాడంటారు.

ఏదేమైనా మీరుచేస్తున్న పని చాలా మంచిది, ఎట్టి పరిస్తితుల్లోనూ ఆపకండి.