ఈశావాస్య ఉపనిషత్తు - 1

"ఈశావాస్య మిద్‌గం సర్వం" అనే మంత్రముతో ఈ ఉపనిషత్తు ప్రారంభం అవుతుంది. అందువలన దీనికి ఈశావాస్య ఉపనిషత్తు అనే పేరు వచ్చింది. ఇందులో 18 మంత్రాలు లేక శ్లోకాలు ఉన్నాయి.
యజుర్వేదం యొక్క శుక్లయజుర్వేద విభాములో వాజసనేయసంహిత ఉంది. ఇందులో 40 అధ్యాయాలు ఉన్నాయి. ఈ ఉపనిషత్తు 40వ అధ్యాయము. "తత్యన్ అధర్వణుడు" అనే మహర్షి తన కుమారునికి ఉపదేశించిన ఉపనిషత్తు ఇది. ఈ ఉపనిషత్తులో పేర్కొనబడ్డ విద్య లేక భగవంతుని సాక్షాత్కరించుకొనే సాధనను "ఈశ విద్య" అంటారు.

ఈశావాస్య ఉపనిషత్తు క్రింది శాంతి మంత్రముతో ప్రారంభము అవుతుంది.
"ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్యతే

ఓం శాంతిః శాంతిః శాంతిః
దేవుడు పరిపూర్ణుడు. ఇది(ఈ ప్రపంచం) పరిపూర్ణమైనది. పరిపూర్ణమైన భగవంతుడి నుండే పరిపూర్ణమైన ప్రపంచం పుట్టింది. పరిపూర్ణం నుండి పరిపూర్ణాన్ని తీసివేసిన తర్వాత కూడా పరిపూర్ణతే మిగిలి ఉంది.

వివరణ: పరిపూర్ణం నుండి పరిపూర్ణం ఎలాపుడుతుంది? తీసివేసిన తర్వాత కూడా పరిపూర్ణమే ఎలా మిగులుతుంది? అనే అనుమానాలు మనకు వస్తాయి. కొన్ని ఉదాహరణల ద్వారా దీనిని చూడవచ్చు. ఒక దీపం నుండి ఎన్ని దీపాలను వెలిగించినా మొదటి దీపము అలాగే మిగతా దీపాలు కూడా సంపూర్ణప్రకాశమే కలిగి ఉంటాయి. అలానే విద్యాదానం విషయం కూడా చెప్పుకోవచ్చు. ఇలానే భగవంతుని పరిపూర్ణత కు కూడా తీసివేయడం వలనో లేక ఇవ్వడం వలనో లోపం కలుగదు.

ఈ మంత్ర సారాంశం ఏమిటంటే దేవుడి నుండి ఉద్భవించడం వలన ఈ ప్రపంచం కూడా భగవంతుని అంశ లేక భగవంతునిచే నిండి ఉన్నదని.

వేదమంత్రాలన్నీ ఓం శాంతిః అంటూ ముగుస్తాయి. మూడు సార్లు శాంతి అని ఎందుకు ముగుస్తాయంటే నిత్యజీవితములోని మూడు ఆటంకాల నుండి బయటపడుటకు. ఆ మూడు ఏమంటే

1.ఆద్యాత్మికం: శారీరక,మానసిక అనారోగ్యాలు మొదలగునవి
2.ఆదిభౌతికం: ఇతర జీవరాసులవలన, ఇతర మానవులవలన కలుగు బాధలు
3.ఆధిదైవికం: ప్రకృతి వలన అంటే వరదలు, భూకంపాలు, పిడుగులు, అగ్ని ప్రమాదాలు మొదలగునవి.

ఈ మూడు రకాలైన బాధల నుండి తప్పించుకోవడానికి మూడు సార్లు శాంతి అని పలుకుతాము.

ఇక ఉపనిషత్తు మొదటిశ్లోకం:
౧. " ఓం ఈశా వాస్య మిద్గం సర్వం యత్కించ జగత్యాం జగత్
తేన త్యక్తేన భుఞ్ఙీథా మాగృధః కస్యస్విద్ ధనం

అర్థం:
జగత్తులో ఏవేవైతే ఉన్నవో అన్నీ భగవంతునిచే నింపబడాలి.. అలాంటి త్యాగబుద్ధితో లోకాన్ని అనుభవించు. ఎవరి ధనాన్నీ ఆశించకు.

వివరణ: నింపబడడం అంటే ముందు శాంతి మంత్రములో చెప్పుకున్నట్లుగా ఈ లోకం దేవుడి నుండి పుట్టింది కాబట్టి లోకం అంతా భవంతుడిమయమే. కాబట్టి నువ్వు కూడా అంటే మనం కూడా సర్వ లోకాన్నీ, లోకములోని అన్ని వస్తువులనూ ,జీవనిర్జీవ పదార్థాలను భగవంతుడిగానే చూడాలి. అంటే భగవంతుని సంపదగానే చూడాలి. అందువలన మన సంపదను లేక ధనాన్ని కూడా భగవంతుని సంపదగానే చూడాలి. అలాంటి త్యాగబుద్ధి మనకు ఉంటే ధనం ఉన్నా,పోయినా మనం బాధపడము. ఆనందముగా ఉండగలము.అలాగే ఎవరి సంపదనూ అంటే పరుల సంపదను
కూడా ఆశించకూడదు.

రెండవ శ్లోకము:
౨. "కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్చతగ్ సమాః
ఏవం త్వయి నాన్యథేతో స్తిన కర్మ లిప్యతే నరే
అర్థం:
లోకములో కర్తవ్యాలను నిర్వహిస్తూ మాత్రమే నూరేళ్ళు జీవించాలని ఆశించు. నీలాంటి వారికి ఇది తప్ప వేరే దారి లేదు. కర్తవ్యాలు నిన్ను అంటవు.

వివరణ: లోకములో జీవించాలంటే పని చేసి తీరాలి.ఆ పని ఫలితం మంచైనా,చెడైనా కావచ్చు. ఆ ఫలితానికి మనము దాసులము. అంటే ఖచ్చితముగా ఫలితం ఉంటుంది. మరి ఈ శ్లోకాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
ముందు మొదటిశ్లోకము గమనిస్తే అంతా భగవంతుని సంపదే కాబట్టి మనము భగవంతుని కొరకే పనిచేయాలి. మన సంపద ,ఐశ్వర్యము భగవంతునికి చెందినదని భావించి అందుకు బాధ్యత వహించిన వ్యక్తిగా జీవితం గడపాలి. ఆ విధముగా మన కర్తవ్యాలను మనం నిర్వర్తిస్తే ఆ పని ద్వారా కలిగే ప్రతిఫలం మనలను తాకదు. మనకు ఇంతకంటే మరో మార్గం లేదు. ఇలా పనిచేస్తూనే మనం నూరేళ్ళూ జీవించాలని ఆశించాలి.

తర్వాతిభాగం

5 Responses to “ఈశావాస్య ఉపనిషత్తు - 1”

మంచి ప్రయత్నం. కొనసాగించండి....

బ్లాగు ఫోటో సంస్కృతికి సంబంధించినదేదైనా పెట్టలేకపోయారా?

Sunita.R said...

ఎంత బాగా చెప్పారు! నేను ఇంత వరకు తినే వస్తువులు మాత్రమే భగవంతునికి సమర్పించాలని అనుకుంటున్నా. కాని ఈ ప్రపంచం మొత్తం దేవునిదే అని మంచి విషయం చెప్పారు. నిజమే. ఈ విధం గా నేను ఎప్పుడూ ఆలొచించలెదు. మీకు ధన్యవాదాలు.

భాగవతం ప్రధమార్ధం లో ఈ విషయాన్ని చాలా స్పష్టం గా చెప్పారు వ్యాస మహర్షి. (నేను ఈ రొజే విన్న్నాను). అంతా భగవంతుడిదే అనడం సులువే , కానీ ఆచరణలో అనుకరించడంఏ చాలా కష్టం..


పూర్ణమదః పూర్ణమిదం - ఈ శ్లోకం ఎందులోదా అని తెలుసుకోవాలని నేను చాలా కాలం నుండి ప్రయత్నిస్తున్నాను. ధన్యవాదాలు.

దెవుడు పరిపూర్ణుడు అవును పరిపూర్ణుడే పరిపూర్ణాన్నుండి పరిపూర్ణం తీసివేస్తే సాధారణంగా మిగిలేదేముండదు కానీ దేవతా విగ్రహాల విషయానికొస్తే తద్భిన్నంగా భక్తులకు అందే శక్తి నిరంతరం పూరింపబడుతుంది గాబట్టి దేవుడు ఎప్పుడూ సంపూర్ణుడే దైవ శక్తి గురించి బహుశా సృష్టి కర్త ఐన బ్రహ్మ దేవుని నాలుగు శిరస్సుల లోనున్న పరమార్ధాన్ని గ్రహిస్తే తెలుస్తుంది